దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మర్చిపోక ముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్కు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మరణించారు.
ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్రముఖ సంగీత వాద్యకారుడు ఫాలీ ఇపుపా కన్సర్ట్లో ఈ తొక్కిసలాట జరిగింది. స్టేడియం వెలుపల ప్రజల్ని చెదరగొట్టేందుకు భద్రతా అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చింది.