అవును మరి.. వస్తువు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ధర ఎక్కువ, తక్కువ ఎంతైనా కావచ్చు. లేదా డబ్బులు కావచ్చు. వాటి విలువ ఎంతైనా ఉండొచ్చు.. దొంగతనం చేస్తే.. అది దొంగతనమే అవుతుంది. దానికి కచ్చితంగా శిక్షను అనుభవించే తీరాలి. తక్కువ విలువ గల వస్తువులను దొంగతనం చేశారని ఎవరినీ విడిచిపెట్టలేం కదా. సరిగ్గా కోర్టు కూడా ఇదే ఆలోచన చేసింది. వారు చేసింది చాలా చాలా తక్కువ విలువైన దొంగతనమే అయినా వారిని కోర్టు విడిచిపెట్టలేదు. వారికి శిక్ష బాగానే విధించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అది ఢిల్లీ నగరం. ఆ నగరంలో ఉండే ఓ దుస్తుల వ్యాపారి (43) నుంచి స్థానికంగా ఉండే ఖలీద్ అనే ఓ వ్యక్తి నిత్యం ముడిసరుకును కొంటుంటాడు. ఈ క్రమంలో తన వద్ద రోజూ జమ అయ్యే మొత్తాన్ని ఆ వ్యాపారి ఏరోజు కారోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాడు. దీన్ని ఖలీద్ గమనించాడు. ఎలాగైనా వ్యాపారి వద్ద ఉన్న డబ్బును దోచుకోవాలని భావించాడు. అందులో భాగంగానే ఓ రోజు ఇంటికి వెళ్తున్న ఆ వ్యాపారిని ఖలీద్ తన స్నేహితులతో కలిసి అడ్డగించాడు. ముసుగులు వేసుకుని వచ్చి వారు ఆ వ్యాపారిని అడ్డుకున్నారు.
అలా ఖలీద్ అతని స్నేహితులు కలిసి వ్యాపారిని అడ్డుకుని అతన్ని గన్‌తో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగును లాక్కెళ్లారు. కానీ తీరా చూస్తే బ్యాగులో కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఖలీద్, అతని ఫ్రెండ్స్ ఖంగు తిన్నారు. ఇక ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని ఖలీద్‌తోపాటు అతనికి సహకరించిన అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలా వారు కేవలం 5 రూపాయలను మాత్రమే దొంగిలించినప్పటికీ వారికి శిక్ష మాత్రం బాగానే పడింది. అయితే నిజానికి దొంగతనం జరిగిన సమయంలో ఆ వ్యాపారి వద్ద జేబులో రూ.10వేల వరకు ఉన్నాయట. కానీ వాటి గురించి తెలియని ఖలీద్ బృందం కేవలం ఆ వ్యాపారి బ్యాగును మాత్రమే తీసుకుని అక్కడి నుంచి ఉండాయించారు. ఏది ఏమైనా… చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అది చిన్నదైనా.. పెద్దదైనా..!