ఖమ్మం జిల్లాలో బైక్ లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి ద్విచక్రవాహనదారుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంజక్షన్ దాడి హత్య ఘటనలో ఖమ్మం జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే తమ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్ ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దరణకు వచ్చారు. మత్తుమందును అధిక మోతాదులో ఇవ్వడం వల్లనే జమాల్ చనిపోయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా.. ఓ ఆర్ఎంపీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే..ఈ ముగ్గురూ పరారీలో ఉండగా వీరి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
జమాల్ భార్య ఫోన్‌కాల్ జాబితాలో హత్యకు పాల్పడ్డ నిందితుల ఫోన్ నెంబర్లు ఉండడం, వారితోనే ఎక్కువసార్లు మాట్లాడినట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించడం కేసుకు మరింత బలం చేకూరుస్తోంది. అందువల్లే పూర్తిగా వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసుల విచారణ సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు జమాల్ కుటుంబసభ్యులందరినీ ఇవాళ ముదిగొండ పోలీసుస్టేషన్లో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం అందింది.