మనిషి గొర్రె అనడానికి ఇంత కన్నా మరో ఉదాహరణ అవసరం లేదనుకోవచ్చు. ఇటీవలే.. కరక్కాయ వ్యాపారం పేరుతో వందల కోట్లు దండుకున్న భారీ మోసాన్ని చూశాం కదా. ఇప్పుడు వేరుశనగకాయ వంతు. అవును.. అచ్చం కరక్కాయ వ్యాపారం లాగానే ఇది కూడా జరిగింది. సేమ్ టు సేమ్ వందల కోట్ల రూపాయలను కస్టమర్ల నుంచి సేకరించి వాళ్లకు పంగనామం పెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటు చేసుకున్నది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ అనే పేరుతో ఓ కంపెనీని పెట్టారు శ్రీకాంత్ అనే వ్యక్తి. అతడే వేరుశనగకాయ(పల్లీలు) ఇస్తాడు. మిషిన్ కూడా ఇస్తాడు. కాకపోతే.. ఆసక్తి ఉన్నవాళ్లు పల్లీల నుంచి నూనె తీసి వాళ్లకే అమ్మేయాలి.. అదే పని. నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని కూడా తామే కొంటామంటూ అందరినీ ఆకర్షించారు వాళ్లు.
అరె.. ఇదేదో బాగుందే. జాబ్‌లు గీబులను నమ్ముకునే బదులు.. మన కష్టాన్ని నమ్ముకుందాం. కంపెనీయే మిషిన్లు కూడా ఇస్తా అంటోంది కదా. అని చెప్పి చాలామంది ఔత్సాహికులు ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు. సంస్థ కూడా ఫుల్లు లాభాల్లో ఉందని.. తమతో ఉన్నవాళ్లకు భవిష్యత్తులోనూ లాభాల్లో వాటా ఇస్తా.. అంటూ ఊదరగొట్టాడు. కాకపోతే మిషినరీ కోసం డబ్బు డిపాజిట్ చేయాలని చాలా మంది నుంచి డిపాజిట్లు సేకరించాడు. పల్లీల నుంచి తీసిన నూనె లీటర్‌కు 35 రూపాయల చొప్పున తీసుకుంటామని.. పిప్పిని కిలో 20 రూపాయలకు తీసుకుంటామని నమ్మబలికాడు. అంతే కాదు.. మల్టీ లెవల్ మార్కెటింగ్ కూడా ప్రారంభించాడు శ్రీకాంత్. లక్ష రూపాయలు కడితే నెలకు 10 వేల వడ్డీ ఇస్తా అని చెప్పాడు. దీంతో అతడిని గుడ్డిగా నమ్మిన కస్టమర్లు… అత్యాశతో తమ వద్ద ఉన్న డబ్బునంతా తీసుకెళ్లి అతడి చేతిలో పెట్టారు. దానికి పక్కాగా అగ్రిమెంట్లు కూడా రాసిచ్చారు నిర్వాహకులు. కానీ.. ఓ మహిళ తనకు రావాల్సిన వడ్డీ ఇవ్వకుండా.. అసలు అడిగితే ఇస్తాం.. ఇస్తాం అంటూ తప్పించుకొని తిరుగుతున్న కంపెనీ నిర్వాహకులపై అనుమానం వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తీగ లాగితే.. కంపెనీ డొంకంతా కదిలింది. చివరకు అది పెద్ద ఫ్రాడ్ కంపెనీ అని పోలీసులు తేల్చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కంపెనీ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఇదివరకు కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్‌కు సంబంధించి కేసులు నమోదయ్యాయట.