బంగాల్​లో ఆటో, బస్సు ఢీ.. 9 మంది కూలీలు మృతి

పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీర్భమ్ జిల్లా మల్లర్ పుర్ లో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రామ్ పుర్హట్ నుంచి మల్లర్ పుర్ వైపు వెళ్తున్న ఆటో 60వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో 8 మంది మహిళా కూలీలు ఉండగా.. ఒక డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కూలీలంతా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.