వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా జయరామ్ హత్యలో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి పోలీసులకు పలు విషయాలను వెల్లడించాడు. జయరామ్ హత్య తర్వాత ఆయన మృతదేహాన్ని కారులో వేసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తిరిగినట్టు రాకేశ్ రెడ్డి విచారణలో వెల్లడించాడు. తన ఫ్రెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు కలవడానికి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అప్పుడు ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఏసీపీ మల్లారెడ్డిని కూడా జయరామ్ విషయంపై సలహా అడిగాడు. దీంతో వాళ్లు మృతదేహం నోట్లో, శరీరంపై మద్యం పోసి.. కారులో కొన్ని మద్యం బాటిళ్లను వదిలేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించాలని వాళ్లు సలహా ఇచ్చారు. ఆ సమయంలో కారులోనే మృతదేహం ఉంది.
తర్వాత మృతదేహాన్ని, కారును వదిలేందుకు ఆంధ్రప్రదేశ్ అయితే బెటర్ అని పోలీస్ ఫ్రెండ్స్ చెప్పడంతో సీన్‌ను ఏపీకి మార్చాడు రాకేశ్. మృతదేహం ఉన్న కారుతోనే విజయవాడ వైపు వెళ్లాడు. నందిగామ దగ్గర మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి వాళ్లు చెప్పినట్టు చేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి కారును రోడ్డు కిందికి వదిలి.. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వచ్చేశాడు.