రాజ్‌కోట్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో టీ స్టాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం మన దేశంలో చిన్నారులు, యువతే కాదు.. చాలా మంది పెద్దలు కూడా పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్న విషయం విదితమే. ఈ గేమ్ మాయలో పడి వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడడం లేదు. అంతగా గేమ్‌లో మునిగి తేలుతున్నారు. అలాగే ఈ గేమ్‌కు చాలా మంది వ్యసనపరులుగా మారుతుండడంతో వారిలో హింసా ప్రవృత్తి కూడా చెలరేగుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పబ్‌జి మొబైల్ గేమ్‌ను నిషేధించారు.
అయితే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ పబ్‌జి మొబైల్ గేమ్ ఆడడాన్ని నిషేధించారు. ఈ నెల 9వ తేదీన అమలులోకి వచ్చిన ఆ నిషేధం ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఆ సిటీలో పబ్‌జి మొబైల్ గేమ్‌పై బ్యాన్ అమలులో ఉన్నప్పటికీ కొందరు పబ్లిగ్గానే గేమ్ ఆడుతూ పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనల్లో మొత్తం 10 మందిని రాజ్‌కోట్ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ దొరికిన వారు కావడం గమనార్హం.
రాజ్‌కోట్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో టీ స్టాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక చోట నలుగురిని, మరొక చోట 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పబ్‌జి మొబైల్ గేమ్‌పై రాజ్‌కోట్ సిటీలో నిషేధం అమలులో ఉందని, కనుక ఎవరూ ఆ గేమ్ ఆడరాదని, ఎవరైనా గేమ్ ఆడుతూ దొరికితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ 188 ప్రకారం వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాజ్‌కోట్ పోలీసులు హెచ్చరించారు.