వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంతో ఏపీ దిగ్భ్రాంతికి గురయింది. నిన్నటి వరకు హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేకానందరెడ్డి.. ఇవాళ విగతజీవిగా మారడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలైతే.. తమకు పెద్ద దిక్కులా ఉన్న వివేకానందరెడ్డి మృతి చెందడం తీరని లోటని వాపోతున్నారు.
ఆయన గుండెపోటుతో గురై మరణించారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆయన బాత్‌రూమ్‌లో పడి ఉండటం, తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్.. దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.
నిన్న చాపాడు మండలంలోని మద్దూరులో ప్రచారం ముగించుకున్న తర్వాత రాత్రి వివేకానందరెడ్డి పులివెందులకు చేరుకున్నారు. రాత్రి ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు. ఇవాళ ఉదయం బాత్‌రూంలో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉండటాన్ని ఇంట్లోని పనిమనుషులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.