‘బీమా కోసం హత్య’ కేసులో కీలక ట్విస్ట్

-

సంచలనం సృష్టించిన ‘బీమా కోసం హత్య’ కేసులో నిందితులను పోలీసులు తొమ్మిది రోజుల్లో పట్టుకున్నారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు వేరే వ్యక్తిని చంపి.. తానే చనిపోయినట్లు నమ్మించేందుకు యత్నించిన రాష్ట్ర సచివాలయంలో సహాయ సెక్షన్‌ అధికారి పాత్లోత్‌ ధర్మ (44)తో పాటు అతడికి సహకరించిన భార్య నీల(43), మేనల్లుడు తేజావత్‌ శ్రీనివాస్‌(30), సోదరి సుంధ (48), ధర్మ 17 ఏళ్ల కుమారుడిని రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన వ్యక్తి బాబు అని ప్రాథమికంగా గుర్తించినా.. పూర్తి వివరాలు కనిపెట్టాల్సి ఉందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

అప్పులు తీర్చేందుకు పక్కా ప్లాన్ వేసిన ధర్మ.. తనలా ఉన్న అంజయ్య అనే వ్యక్తిని చంపి తానే చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. మామిడి తోటలో పని ఇస్తానని చెప్పి అంజయ్య అనే వ్యక్తిని నిజామాబాద్ నవీపేటకు తీసుకెళ్లాడు. ధర్మ ప్రవర్తనతో అనుమానం వచ్చిన అంజయ్య అతడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో తన మేనల్లుడు శ్రీనివాస్​ను మరో వ్యక్తి కోసం వెతకమని చెప్పాడు.

 

ఈ నెల 8న శ్రీనివాస్‌ నిజామాబాద్‌ స్టేషన్‌కు వెళ్లి.. 42 నుంచి 44 ఏళ్ల వయసున్న బాబు అనే వ్యక్తితో మాట్లాడాడు. అతడిని ధర్మ, శ్రీనివాస్‌లు కారులో బాసర తీసుకెళ్లి గుండు చేయించారు. ధర్మ దుస్తులు అతడికి తొడిగించారు. అదే రోజు రాత్రి 11.30 సమయంలో టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌ శివారువైపు వచ్చారు. బాబుకు కల్లు తాగించి.. ఘటన జరిగిన స్థలానికి రాగానే గొడ్డలి, కర్రలతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ముందు సీట్లో కూర్చోబెట్టి పెట్రోలు పోసి తగలబెట్టారు. తిరిగి నిజామాబాద్‌ వెళ్లారు. ఒక్కో ఆధారం సేకరించిన పోలీసులు.. ఈ పథకంలో భాగస్వాములైన అందరినీ అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version