పూణె-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా బస్సంతా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు ప్రాణభయంతో బస్సు కిటిల్లో నుంచి కిందకు దూకేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేడ్ శివపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను కాపాడారు. అయితే బస్సులో మంటలు చెలరేగగానే ప్రయాణికులంతా కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వివరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
అయితే వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులు వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మండు వేసవిలో మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.