వక్ఫ్ బోర్డుతో ఒవైసీ బ్రదర్స్ అనుచరులకే లాభం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వక్ఫ్‌బోర్డును అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చట్టంలో కలెక్టర్‌కు అధికారాలు ఉంటాయని..
ఇందులో మహిళల భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించారు. భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వక్ఫ్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇకపై నాయకుల ఇళ్లలో కాదు, కంప్యూటర్‌లో ఉంటాయని తెలిపారు. వక్ఫ్ బోర్డుతో ఎంత మందికి లాభం చేశారో రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో 70 శాతం వక్ఫ్ భూములను కాంగ్రెస్, ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మసీదులు వేరు, వక్ఫ్ బోర్డు భూములు వేరు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై విచారణను వచ్చేనెల 5కు వాయిదా వేస్తూ.. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశించింది.