ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్ చేసింది. రూ.793కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇందులో దాల్మియా సిమెంట్స్ భూమి కూడా ఉన్నట్లు వెల్లడించారు. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపులో దాల్మియాపై అభియోగం నెలకొంది.
దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల కేటాయింపులపై అభియోగాలు వచ్చాయి. జగన్‌తో కలిసి అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు 2013లో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ సుమారు రూ.150 కోట్ల అక్రమ లబ్ధి పొందినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. జగన్ రూ.150 కోట్ల లబ్ధిని షేర్లు, హవాలా రూపంలో నగదు పొందారని.. రూ.95కోట్లు రఘురాం సిమెంట్స్‌లో షేర్లు పొందారని.. రూ.55కోట్లు హవాలా రూపంలో డబ్బు ఇచ్చినట్లు అభియోగాలు దాఖలు చేశారు. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీలాండరింగ్ విచారణ జరిపిన ఈడీ తాజాగా ఈ ఆస్తులను అటాచ్ చేసింది.