మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్‌కు చెందిన ఫర్ఖాన్ ఖురేషీ అనే విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి పబ్‌జి ఆటలో మునిగిపోయాడు.
పబ్‌జి మొబైల్ గేమ్.. ఈ గేమ్ గత కొంత కాలం నుంచి వివాదాస్పదం అవుతోంది. దీని వల్ల పిల్లలు, యువతలో అనారోగ్యం విషయంలో దుష్పరిణామాలు వస్తున్నాయని, అలాగే వారి మానసిక ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని గత కొంత కాలంగా అనేక మంది చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారు. అయినప్పటికీ యువత, పిల్లలు పబ్‌జి గేమ్ ఆడడం మానుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు ఏకధాటిగా 6 గంటల పాటు పబ్‌జి గేమ్ ఆడాడు. చివరకు గుండె పోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్‌కు చెందిన ఫర్ఖాన్ ఖురేషీ అనే విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి పబ్‌జి ఆటలో మునిగిపోయాడు. ఈ క్రమంలో సాయంత్రం 7 గంటల సమయంలో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఖురేషీ మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.
కాగా పబ్‌జి మొబైల్ గేమ్‌లో తీవ్రమైన భావావేశాలకు లోను కావల్సి వస్తుందని, అందువల్లే ఆ గేమ్‌లో ఓటమికి తట్టుకోలేక ఖురేషీ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే ఖురేషీ గేమ్‌లో ఓడిపోవడాన్ని తాము చూశామని, అతను ఆ ఓటమికి తట్టుకోలేకే తీవ్రమైన మనస్థాపానికి లోనై గుండె పోటు వచ్చి కుప్పకూలాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజానికి ఖురేషీ చాలా ఆరోగ్యంగా ఉంటాడని, అతను చక్కని స్విమ్మర్ అని కూడా వారు తెలిపారు. ఏది ఏమైనా.. పబ్‌జి మొబైల్ గేమ్ అనేది తీవ్రమైన దుష్పరిణామాలను కలగజేస్తుందని మరోసారి రుజువైంది. మరి ఈ గేమ్ నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తే తెలుస్తుంది..!