CRPF పరీక్షను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి: స్టాలిన్

-

సెంట్రల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించే కంప్యూటర్‌ టెస్ట్‌లో తమిళంను చేర్చకపోవడాన్ని నిలదీశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌. కేంద్ర ప్రభుత్వం తమిళంపై వివక్ష చూపకూడదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు దీని గురించి లేఖ రాశారు స్టాలిన్. ఇంగ్లీష్‌, హిందీలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనడం ‘వివక్షత’, ‘ఏకపక్షం’ అని రమండిపడ్డారు. దీని వల్ల తమిళనాడుకు చెందిన ఆశావహులు తమ సొంత రాష్ట్రంలో మాతృభాషలో పరీక్ష రాయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

కాగా, 100 మార్కులలో 25 మార్కులు ‘హిందీ ప్రాథమిక అవగాహన’ కోసం కేటాయించడం హిందీ మాట్లాడే అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్ తమిళ అభ్యర్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘ఇది ఏకపక్ష నిర్ణయం మాత్రమే కాదు, వివక్షతో కూడుకున్నది’ అని అన్నారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు తమిళ ఆశావహులను నిరోధించినట్లవుతుందని, ఇది రాజ్యంగ హక్కుకు విరుద్ధమని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమిత్‌ షా వెంటనే స్పందించాలని లేఖ ద్వారా సీఎం స్టాలిన్‌ కోరారు. హిందీ మాట్లాడని యువకులు కూడా సీఆర్పీఎఫ్‌ పరీక్ష రాసేందుకు వీలుగా తమిళంతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు స్టాలిన్. మరోవైపు నోటిఫికేష్‌ ప్రకారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోని 9,212 ఖాళీలలో 579ను తమిళనాడు నుంచి భర్తీ చేయనున్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version