తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయ భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో గురువారం ఉదయం 9.55 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
పాత మెదక్ జిల్లా దుబ్బాకలో 1968 జూన్ 28న కేశవరెడ్డి, పుష్పమ్మలకు విజయభాస్కర్‌రెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీతోపాటు న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1992 డిసెంబరు 31న న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. ఎన్‌ఐఆర్‌డీ, ఏపీ చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
విజయభాస్కర్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం గత ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది. అప్పట్లో న్యాయవాదుల కోటా నుంచి సిఫార్సు చేసిన ఏడుగురిలో ఆయన పేరు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏడుగురిలో అయిదుగురిని మాత్రమే గత మార్చిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత సిఫార్సుల ఆధారంగానే భాస్కర్‌రెడ్డిని న్యాయమూర్తిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయనతో కలిపి హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరనుంది.