న్యూజిలాండ్ దేశాన్ని గాబ్రియెల్ తుపాను వణికిస్తోంది. ఆ దేశంలో ఈ తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి న్యూజిలాండ్ ఉత్తర ద్వీపం అతలాకుతలమైంది. భారీ వర్షానికి వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరదల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మూడు రోజులుగా ఉత్తర దీవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా ముంచెత్తిన వరదలతో జనజీవనం స్తంభించిపోవడంతో ఆ దేశ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇవాళ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉష్ణమండల తుఫాను నార్త్ ఐలాండ్‌ను తాకడంతో ప్రభుత్వం ఇవాళ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా పది వేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ దేశ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ తుఫాన్ నార్త్ ఐలాండ్‌లో చాలావరకు పెద్ద ప్రభావాలను చూపుతోందని మెక్‌అనుల్టీ చెప్పారు.