సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కారం అందించింది. భారతీయ సినిమాకు ఆయన విశిష్ట సేవలు అందించిన కారణంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో అక్టోబర్ 8న ఆయన ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ‘X’ ఖాతాలో పేర్కొన్నారు. మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన ఆర్ట్ హౌస్ డ్రామా మృగయా (1976)తో మిథున్ చక్రవర్తి వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో తన అద్భుత నటనతో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును సైతం మిథున్ గెలుచుకున్నారు.
ఆ తర్వాత 1982 వచ్చిన డిస్కో డ్యాన్సర్ మూవీ అప్పటి యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది.ఇండియాలోనే కాకుండా సోవియట్ యూనియన్‌లోనూ విడుదలైన డిస్కో డ్యాన్సర్ బాక్సాఫీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మిథున్ చక్రవర్తి సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఓ వైపు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు.ఇదే ఏడాది జనవరిలో మిథున్ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను అందుకున్న విషయం తెలిసిందే.