తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోని అత్యున్నత పథకం అని,ఇదొక చారిత్రక నిర్ణయం అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.రానున్న బడ్జెట్ లో జరిగే కేటాయింపుల అనుసారం నియోజకవర్గ పరిధిలోని 2000 మందికి దళిత బంధు పథకం ఇవ్వనున్నామని అన్నారు.నియోజకవర్గ పరిధిలో ఇవాళ ఏర్పాటుచేసిన దళిత బంధు అవగాహన సదస్సులో భాగంగా ఇక్కడికి విచ్చేసి మాట్లాడారు.
ప్రయోగాత్మకంగా పథకం అమలు తెలుసుకునేందుకు నియోజకవర్గ పరిధిలో వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అనువర్తింపజేశామన్నారు. పథకం అమలులో భాగంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, దీంతో తమ అభివృద్ధిని తామే దళితులు నిర్వచించుకునే దిశగా చైతన్యవం తులు కావాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని,ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందని అన్నారు.