ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలపై అందులోనూ.. దళిత మహిళలపై దారుణంగా లైంగికదాడులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న హత్రాస్ ఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ అమానుష ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీనిని మరువకముందే.. కాన్పూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ (22)పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమెపై తుపాకీ గురిపెట్టి, మాజీ గ్రామపెద్దతోపాటు ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేశారు. అయితే.. ఈ దారుణ ఘటన వారం క్రితం ఘటన చోటుచేసుకుంది. కానీ ఆదివారం బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్పీ కేశవ్ కుమార్ చౌధరి వెల్లడించారు.
ఆ మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి, తుపాకి గురిపెట్టి.. ఆమెపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బాదితురాలిని నిందితులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్లు, ఎస్సీ-ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం-1989 ప్రకారం కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు.