ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ ఆటగాడి జీవితం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలాసవంతమైన జీవితంతో పాటు, భారీగా డబ్బు, పేరుకి పేరు అన్ని అతని సొంతం అవుతాయి. జాతీయ జట్టుకి ఆడితే చాలు అతని లైఫ్ తిరిగిపోయినట్టే. అలాంటి 61 టెస్టులు ఆడి 261 వికెట్లు తీసి సత్తా చాటిన ఆటగాడు అయితే…? ఇక అతని జీవితం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాని ఒక ఆటగాడి జీవితం మాత్రం నేడు నానా కష్టాలు పడుతుంది.
అతని పేరే డానిష్ కనేరియా… అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగి ఇంగ్లాండ్ లాంటి జట్లకు చుక్కలు చూపించిన ఈ పాకిస్తాన్ ఆటగాడు నేడు కష్టాలు పడుతున్నాడు. తనను ఆదుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నాడు. వ్యతిరేకించే కొన్ని వర్గాలు సమాజంలో ఉన్నాయని… తనను ప్రేమించే మనుషుల ముందు అవి నిలబడలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేసాడు. తాను ఎప్పుడూ జీవితంలో సానుకూలంగానే ఉన్నానని చెప్పిన అతను. అవమానించేవారిని పట్టించుకోలేదన్నాడు. ప్రస్తుతం తన జీవితం అంత సాఫీగా సాగడం లేదన్నాడు.
సమస్యల పరిష్కారం కోసం పాక్, ఇతర దేశాల్లోని చాలామందిని కలిశానని చెప్పిన అతను. చాలామంది పాక్ క్రికెటర్ల సమస్యలు పరిష్కారమైనా ఇప్పటికీ నాకే సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఒక క్రికెటర్‌గా పాకిస్థాన్‌కు చేతనైనంత చేశానని అందుకు గర్విస్తున్నానన్నాడు. అత్యవసరమైన ఈ సందర్భంలో పాక్ ప్రజలు నాకు సాయపడతారని సానుకూలంగా ఉన్నానని ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా దిగ్గజ ఆటగాళ్లు, క్రికెట్ పాలకులు, ఇతర దేశాల సహకార౦ తనకు అవసరమన్నాడు. దయచేసి ముందుకొచ్చి తనకు సాయం చేయాలని కోరాడు.