TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా డీఏవో పరీక్షపత్రాన్ని నిందితులు ఇతరులకు విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రూ.6 లక్షలకు విక్రయించినట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి నగర సిట్ అధికారులు శుక్రవారం రోజున ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్, సుష్మితను అరెస్ట్ చేశారు.
ఖమ్మం ప్రాంతానికి చెందిన సాయిలౌకిక్, సుష్మిత భార్యాభర్తలు. సుష్మిత గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చినపుడు లీకేజీ సూత్రధారి, కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తన వద్ద డీఏవో ప్రశ్నపత్రం ఉన్న విషయం బయటపెట్టాడు. సుష్మిత ఈ విషయాన్ని సాయిలౌకిక్‌కు చెప్పింది.
అనంతరం హైదరాబాద్ వచ్చిన సాయిలౌకిక్ రూ.10లక్షలకు డీఏవో మాస్టర్ ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్రవీణ్‌తో బేరమాడాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలిచ్చి ప్రశ్నపత్రం తీసుకెళ్లాడు. మిగిలిన సొమ్ము ఫలితాల అనంతరం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రవీణ్‌కుమార్ బ్యాంకు ఖాతాలో ఒకేసారి రూ.6లక్షలు జమ అయినట్టు నిర్ధారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. సాయిలౌకిక్ ద్వారా ఆ లావాదేవీ జరిగినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో డీఏవో ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన విషయం బయటపడింది.