పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు పొంచివుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు తో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. టిఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పువ్వాడ అజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.” దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఉంది.. పోలవరంతో తెలంగాణ కు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే కానీ ఇన్నేళ్లు గుడ్డి గుర్రం పళ్ళు తోమినారా?”. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాసోజు శ్రవణ్.