ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రపంచంలో అనేక చోట్ల ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం విదితమే. కాగా యూకేలో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అక్కడ ప్రస్తుతం ట్రయల్స్‌ను నిలపివేశారు. అలాగే బ్రెజిల్, అమెరికా, సౌతాఫ్రికాలలోనూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. కానీ భారత్‌లో మాత్రం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్ ను ఆపలేదు.
యూకేలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ భారత్‌లో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఆపేదిలేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇది వరకే తెలిపింది. ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వారు బాగానే ఉన్నందున ట్రయల్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలియజేసింది. అయితే దీనిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) స్పందించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తిన విషయాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదని, అలాగే ఆ వ్యాక్సిన్‌కు ఇతర దేశాల్లో ట్రయల్స్ ను నిలిపివేస్తే.. మీరు మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని.. డీసీజీఐ సీరమ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రశ్నించింది. ఇవే విషయాలపై సమాధానాలు చెప్పాలని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు డీసీజీఐ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. దీనిపై సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పందించాల్సి ఉంది.