సినిమా తారలను వారి అభిమానులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అభిమానులైతే ఏకంగా తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లను దేవుళ్లుగా భావిస్తారు. హీరో, హీరోయిన్లకు గుడులు కట్టించిన సందర్బాలు కూడా లేకపోలేదు. వాళ్లని ఎవరు ఏమన్నా సహించరు. అయితే తాజాగా అలాంటి వీరాభిమానులు తమ హీరోయిన్ ను ట్రైలర్ లో చూపించి సినిమాలో చూపించలేదని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. హాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ హౌస్ యూనివర్సల్ స్టూడియోస్ ఎస్టర్ డే అనే సినిమాను తెరకెక్కించింది. అయితే ముందుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమా ట్రైలర్ లో హాలీవుడ్ అందాల తార యానా డీ ఆర్మాస్ కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక తమ అభిమాన హీరోయిన్ ఉందని చాలామంది ఈ సినిమాను చూశారు. కానీ సినిమా చూసిన తరవాత మాత్రం హీరోయిన్ లేకపోవడంతో అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే కొంతమంది సినిమా చూసి పోనీలే అని వదిలేయగా… ఇద్దరు వీరాభిమానులు మాత్రం ఏకంగా కోర్టుకెక్కారు.
అమెజాన్ ప్రైమ్ లో 3.99 డాలర్లు పెట్టి తమ సమయాన్ని డబ్బులను వెచ్చించి సినిమా చూసామని కానీ తమ అ ఫేవరెట్ హీరోయిన్ అర్మాస్ ఎక్కడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హీరోయిన్ ను ట్రైలర్ లో వాడుకుని సినిమాకు ప్రచారం చేసుకున్నారని రగిలిపోయారు. అక్కడితో ఆగకుండా ఈ సినిమా నిర్మాణ సంస్థ యూనివర్సల్ స్టూడియోస్ పై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మరి అభిమానుల కోర్టు కేసు పై అమెరికా కోర్టు ఏ విధంగా తీర్పును ఇస్తుందో చూడాలి.