సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

-

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతుడు/మృతురాలికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.

మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్‌, చెన్నై వాసి సీతారామన్‌, దిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. ఓ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూంలో చెలరేగిన మంటలతో.. పైఅంతస్తుల్లో ఉన్న లాడ్జిలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు. పొగ దట్టంగా వ్యాపించి పలువురు స్పృహ కోల్పోయి లాడ్జిలోని గదులు, ఆవరణలో పడి ఉన్నారు.

విషయం తెలుసుకుని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే సాయన్న చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, క్షతగాత్రులను గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నగర సీపీ ఆనంద్‌, అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, డీసీపీ చందనాదీప్తి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల భవనాలు ఉండటంతో మంటలు వ్యాపిస్తాయన్న ఆందోళనతో ముందుగానే పోలీసులు ఖాళీ చేయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version