సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాద ఘటన జరిగిన దక్కన్ మాల్ ఏ క్షణమైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజులుగా మంటల్లో ఉన్న భవన సముదాయంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. నిన్న 1, 2, 3 అంతస్తుల వరకూ శ్లాబులు కూలి సెల్లార్లో పడిపోయాయి.
ఈ ప్రాంతంలో మంటలు ఎక్కువగా రావడం వల్లే స్టాల్ పూర్తిగా బలహీన పడి కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం క్రమంగా బలహీనపడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. భవనం చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసిన కుటుంబాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ప్రమాదంలో చిక్కి గల్లంతైన ముగ్గురిలో శనివారం ఒకరి ఎముకల అవశేషాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు.
ఇక ఇప్పటి వరకు ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో ఓ వ్యక్తి మృతదేహం శనివారం రోజున భవనం మొదటి అంతస్తులో లభించింది. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదని.. వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు రెస్క్యూ టీమ్ వెల్లడించింది.