హిజ్బుల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ వాయుసేన హతమార్చడంతో చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. తాజాగా ఈ పరిణామాలపై ఇరాన్ స్పందిస్తూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనుగోలుదారుల్లో ఆందోళనలు నెలకొనడంతో ధరలు పెరిగాయని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ ధర 72 డాలర్లను దాటేయగా..ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌పై మాత్రం దీని ప్రభావం అంతగా లేదు. బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్టులు 16శాతం పెరిగాయని తెలుస్తోంది. గత వారం బ్రెంట్‌క్రూడ్ ధర 3 శాతం పతనం కాగా..డబ్ల్యూటీఐ ధర 5 శాతానికి తగ్గింది.
ఇదిలాఉండగా, గతంలో చైనా ఆర్థికవ్యవస్థ ఒత్తిడిలో ఉందని కథనాలు రావడంతో అవి చమురు ధరలను ప్రభావితం చేశాయి. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో మార్కెట్లో పరిస్థితి దిగజారిపోయింది.కానీ,సోమవారం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో చమురు రవాణా మరింత కష్టం కానుందని, ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హిజ్బుల్లా, హమాస్, హౌతీలపై దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ఇంధన ధరలు భగ్గుమనడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో ఇరాన్ నేరుగా యుద్ధం ప్రకటించే చాన్స్ ఉందని సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసిలో అమెరికా నౌకలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.