ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సీఎంపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు.. ఆయా అంశాలపై కోర్టులకు కూడా వెళ్లాయి. అనేక కార్యక్రమాలను నిలుపుదల చేయించాయి. అయినప్ప టికీ.. సీఎం జగన్ దూకుడు తగ్గించలేదు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే తన పథకాలు, కార్యక్రమాలను కొనసాగించేలా ముందుకు సాగుతున్నారు. దీంతో అవాక్కయిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర పక్షాలు కొందరిని ప్రోత్సహించి తెరవెనుక డ్రామాలు ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషాను రంగంలోకి దింపాయనే విమర్శలు వస్తున్నాయి.
ఎప్పుడో ఆయన రిజిస్టర్ చేసుకున్న అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోందని, ఆఖరుకు వైఎస్సార్ ఫోటోను కూడా వినియోగిస్తోందని ఆయన లొల్లి పెట్టారు. నేరుగా ఆయన ఇక్కడెక్కడా కోర్టులు లేనట్టుగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. వైఎస్సార్ సీపీకి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే సెప్పెంబరు 17నాటికి వాయిదా వేసింది. అయితే, ఈ విషయం ఇప్పుడు వైఎస్సార్ సీపీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు పార్టీ నాయకులు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా.. ఎదుర్కొంటూవచ్చిన నాయకులు ఇప్పుడు ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు.
ఇప్పుడు ఏం చేద్దాం.. అని చర్చల్లో మునిగిపోయారు. వాస్తవానికి అన్నా వైఎస్సార్ పార్టీ వ్యవహారం ఇప్ప టిది కాదు.. 2014 ఎన్నికలకుముందు కూడా రాజకీయంగా ముందుకు వచ్చింది. మా పార్టీ ఎప్పుడో వైఎస్ జీవించి ఉన్న సమయంలోనే రిజిస్టర్ అయిందని, ఇప్పుడు దానిని మీరు ఎందుకు వాడుతున్నా రని మహబూబ్ భాషా నిలదీసినప్పుడు.. వైఎస్సార్ అన్నదానికి యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ అని జగన్ తరఫున వాదించారు.
అదేసమయంలో వైఎస్ తన తండ్రి కనుక ఆయన ఫొటోను వినియోగించుకునే రైట్ తనకు ఉందని కూడా చెప్పారు. దీంతో అప్పట్లో వివాదం సర్దుమణిగింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ వివాదాన్ని కావాలని ప్రతిపక్షాల ప్రోత్బలంతో కోర్టుకు లాగారనే విమర్శలు వస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పాత వాదాన్నే వినిపించాలని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.