సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలిసీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతూనే ఉంది. కొత్త తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం.. వాట్సాప్ సమాచారాన్ని ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ తో పంచుకుంటామని ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ నెలలో తమ టెర్మ్స్ ఆండ్ కండిషన్స్ ను అనుమతి తెలుపకపోతే వాట్సాప్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, సదరు సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగా యాప్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత, నిరసన వ్యక్తమైంది. ఏకంగా కోట్లాది మంది వాట్సాప్ అకౌంట్లను క్లోస్ చేసి, యాప్ అన్ ఇస్టాల్ చేశారు. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్‌ను వినియోగించడానికి సిద్ధమయ్యారు.
అయితే, వాట్సాప్ కొత్త పాలసీకి వ్యతిరేకిస్తూ.. దేశంలోని పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ కొత్త పాలసీకి అనుమతి తెలుపడం వారి వారి వ్యక్తిగత విషయమని తెలిపింది. ఇష్టం ఉంటేనే వాట్సాప్‌లో కోనసాగాలనీ, నచ్చకుంటే మరో యాప్‌ను మారిపోవాలనే అభిప్రాయాన్ని కోర్టు వెలిబుచ్చింది. మీరు వాట్సాప్ అకౌంట్ వాడాలా? వద్దా? అనేది మీ ఇష్టం. ఒకవేళ వొద్దనుకుంటే వేరే యాప్ కు మారండి. చాలా యాప్‌లు కూడా మీ వ్యక్తిగత సమాచారం కోసం సమ్మతిని అడుగుతుంటాయనీ, వాటిని కూడా పరిశీలించుకోవాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. ఈ కేసుపై ఇంకా పూర్తి సమాచారం అందాలనీ, ఏ విషయాలు ఆ సంస్థ సేకరిస్తుందనేది తెలియాల్సివుందంటూ ఈ కేసును ఈ నెల 25కు కోర్టు వాయిదా వేసింది.
కాగా, వాట్సాప్ వినియోగదారుల నుంచి కొత్త పాలసీపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వాట్సాప్ సంస్థ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొత్త పాలసీని ఇప్పడే అమలు చేయడం లేదని, మీ వ్యక్తి గత సమాచారం ఎవరితోనూ పంచుకోమంటూ ఆ సంస్థ వాట్సాప్ యాప్‌లో స్టేటస్ రూపంలో పేర్కొంది.