రేవంత్ టార్గెట్ గా ఢిల్లీ వార్ ?

-

గ్రూపు రాజకీయాలు పేరు చెబితే మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ . ఇక్కడ ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. పార్టీ ఎదుగుదల కంటే సొంత పార్టీ నేతల రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా మిగతా కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. దీని కారణంగానే తెలంగాణలో 2014 నుంచి టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉంది. అలాగే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగా ఇప్పుడు అధికారం కోసం టిఆర్ఎస్ కు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది అంటే , ఇదంతా కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగానే అనేది బహిరంగ రహస్యమే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు ఎంపిక కోసం తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పార్టీ నాయకుల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టి అధిష్టానానికి నివేదిక ఇచ్చే నిమిత్తం ఢిల్లీ వెళ్లడంతో, ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పై అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది.
 కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో రేవంత్ కు ఆ పదవి దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు అంతా ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాల ద్వారా, అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు అయ్యేందుకు రేవంత్ కు అర్హత లేదని, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కాదు అని , అటువంటి వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదు అనే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ లు అధిష్టానం వద్ద హైలెట్ చేస్తున్నారు. రేవంత్ కు కాకుండా తమలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని , అధిష్టానానికి సంకేతాలు పంపిస్తున్నారు.
ఇప్పటికే ఈ పదవి కోసం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వి హనుమంతరావు వంటివారు పోటీపడుతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది . తమలో ఎవరికి పదవి వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు కానీ, రేవంత్ కు మాత్రం ఆ పదవి ఇచ్చేందుకు మాత్రం తాము ఒప్పుకోము అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీ స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి అధిష్టానంపై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి కొద్ది రోజుల్లోనే పిసిసి అధ్యక్ష పదవి ఎవరిని వరించ బోతుంది అనేది క్లారిటీ రాబోతోంది. ఇప్పుడు పి సి సి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా, కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version