డిప్యూటీ సీఎం సొంత కేడర్ కి గట్టి వార్నింగే ఇచ్చారా

-

ఏపీ డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి సొంత పార్టీ నేతలకు షాకిస్తున్నారు.రాష్ట్రంలో ఏ మంత్రికి తనకు ఉన్నన్ని బాధలు లేవని తాను ఎంత ఓపిక గా చెబుతున్నా గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పెడుతున్నారని సొంత కేడర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అంతేనా మీరు వద్దంటే ఇక ఆ నిర్ణయం కూడా తీసుకుంటానంటూ సొంత పార్టీ నేతలను గట్టిగానే అదిలించారు. డిప్యూటీ సీఎం అంతలా ఇబ్బందిపెడుతున్న సొంత పార్టీ నేతలు ఎవరబ్బా అని అన్ని పార్టీల నేతలు చిత్తూరు జిల్లాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారట…


రాష్ట్రంలో ఎవరికీ లేనన్ని బాధలు తనకే ఉన్నాయని తెగ బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. గ్రూపు రాజకీయాలు కొలిక్కి రాకపోవడం.. ప్రతి విషయంలో కేడర్‌ చుక్కలు చూపిస్తుండటంతో ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకొంటానని హెచ్చరించారు. నారాయణస్వామి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడని ఆయన.. డిప్యూటీ సీఎం అయ్యాక అన్నీ ఇబ్బందులేనట. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సమస్యలేంటా అని అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్న తర్వాత అంతా సానుభూతి వ్యక్తం చేస్తున్నారట…

చిత్తూరు జిల్లా అంటే గ్రూప్ పాలిటిక్స్‌కి పెట్టింది పేరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. నారాయణ స్వామి మంత్రి అయ్యాక.. గ్రూప్‌ పాలిటిక్స్‌ కాస్తా గంగాధర నెల్లూరులో పీక్స్‌ చేరాయట. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, SRపురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదని చెబుతారు స్థానిక వైసీపీ నాయకులు. వైసీపీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా.. ఎన్నికల్లో ఒక్కపైసా ఖర్చు చేయనివారికి కాంట్రాక్ట్‌ పనులు.. ఇసుక రీచ్‌లు ఇచ్చారని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయట.

వెదురుకుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహణకు కొన్ని గ్రామాలకు అనుమతి ఇవ్వలేదు. దీనిని మనసులో పెట్టుకున్న కొంతమంది.. మాకు మీ దగ్గర విలువ లేదు.. మా కోసం ఒకరోజు వస్తారుగా అప్పుడు చూద్దాం అని నారాయణస్వామితో నేరుగానే చెప్పేశారట. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారట. నిజానికి వెదురుకుప్పం మండలంలో రెండు వర్గాలుగా నాయకులు మధ్య వర్గ పోరు నడుస్తుంది. నెల క్రితం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజురెడ్డి.. టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి భీమ శంకర్ రెడ్డిలు డిప్యూటీ సీఎంను కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ చేరికలు వైసీపీలోని మరో వర్గానికి రుచించలేదట.

గ్రామం నుంచి కొందరిని తరిమివేయాలంటే ఎలా? ఎక్కడైనా అలాంటి చట్టం ఉందా?.. మీరు వద్దంటే చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అని డిప్యూటీ సీఎం కేడర్‌ ముఖం మీదే చెప్పేశారట. జల్లికట్టుపై నేనేమీ చేయలేకపోయాను.. ఎస్పీతో మాట్లాడినప్పటికీ అనుమతి ఇవ్వలేదు..ప్లీజ్ అర్థం చేసుకుని మారండని కేడర్‌తో ఆయన వేడుకున్నారట. గ్రూపు రాజకీయాలకు తోడు.. అధికారులు మాట వినకపోవడంతో..ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారట డిప్యూటీ సీఎం. ఈ అంశంపై ఎప్పటి నుంచో ఆవేదన ఉన్నా..సమయం చూసుకుని బరస్ట్‌ అయ్యారని అనుకొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version