డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్​కు బెయిల్

-

డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టు చేసి 10రోజులు గడవక ముందే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సివస్తుంది. అరెస్టయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం కలకలం రేపుతోంది.

గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌కు కొకైన్‌, హెరాయిన్‌, ఎమ్​డీఎమ్​ఏ, ఎల్​ఎస్​డీ వంటి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎడ్విన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎడ్విన్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

కలకలం రేపిన గోవా కర్లీస్‌ షాక్‌ రెస్టారెంట్‌లో, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బీజేపీ నాయకురాలు సోనాలీ పొగాట్‌ మృతికేసులో నిందితుడిగా ఉన్న ఎడ్విన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పోలీసులకు దొరకకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. ఎడ్విన్‌ను పట్టుకునేందుకు పలు కోర్టులను ఆశ్రయించి ఈనెల 5న గోవా నుంచి పట్టుకొచ్చారు. అలాంటి వ్యక్తి బెయిల్‌ పొంది తప్పించుకోవడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి ఎడ్విన్‌పై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద హైదరాబాద్‌లో రాంగోపాల్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిల్లో రాంగోపాల్‌పేట ఠాణా కేసులో ఈనెల 5న అరెస్ట్‌ చేశారు. అంతకుముందే మిగిలిన రెండు ఠాణాల్లోని కేసుల్లో ఎడ్విన్‌ ముందస్తుగా బెయిల్‌ పొందాడు. రాంగోపాల్‌పేట కేసులో ఎడ్విన్‌ చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండగానే.. మిగిలిన రెండు కేసుల్లో ముందస్తు బెయిళ్లను రద్దు చేయించాలని హెచ్‌న్యూ బృందం కసరత్తు చేసింది. ఈ మూడు కేసుల ఆధారంగా ఎడ్విన్‌పై పీడీ చట్టం ప్రయోగించి ఏడాదిపాటు కటకటాలకే పరిమితం చేయడం ద్వారా గోవా డ్రగ్‌ సర్కిల్‌లో వణుకు పుట్టించాలని భావించింది. కానీ ఎడ్విన్‌కు నాంపల్లిలోని మొదటి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరుచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version