కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. పంబ నుంచి స్వామి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో స్వామి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలాఉండగా, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అయ్యప్పలకు శబరిమలలో చేదు అనుభవం ఎదురవుతోంది. తమకు సౌకర్యాలు సరిగా అందడం లేదని కొందరు అయ్యప్పలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వేల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకోగా.. మరికొంత మంది సంక్రాంతి మకర జ్యోతి సమయానికి దర్శనానికి వెళ్తుంటారు. మకర జ్యోతి దర్శనం తర్వాత ఆలయాన్ని ట్రావెన్ కోర్ సంస్థానం మూసి వేయనుంది.