టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ లో సెమి ఫైనల్స్ తర్వాత జట్టులోకి రాని ధోని ప్రస్తుతం విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చేసాడు. ఇటీవల ఆర్మీలోని పారమిలటరి రెజిమెంట్ లో ప్రత్యేక శిక్షణ అనంతరం మళ్ళీ క్రికెట్ మీద ధోని దృష్టి సారించాడు. 2014 లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోని ఆ తర్వాతి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ మీద దృష్టి సారించాడు. అయితే గత కొంత కాలంగా టీం ఇండియా ధోని నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూడలేకపోతుంది.
వరుసగా విఫలమవుతూ వస్తున్న ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధోని మాత్రం దీనిపై స్పంధించకపోగా ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి దూరంగా ఉన్నాడు. వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచకప్ తర్వాత అతను తప్పుకునే అవకాశం ఉందని, అప్పటి వరకు క్రికెట్ కి దూరంగా ఉంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ధోని మాత్రం వాటిపై స్పందించడం లేదు. ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా సీరీస్ కి, ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ సీరీస్ కి కూడా ధోని ఆడటం లేదు…
మరి ఎప్పుడు అందుబాటులోకి వస్తాడు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తో జరగబోయే ఒక టెస్ట్ మ్యాచ్ కి ధోని కామెంటేటర్ గా వస్తున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్స్ లో డే అండ్ నైట్ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కి ధోని వ్యాఖ్యాతగా రానున్నాడు. ఈ మేరకు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించింది. ఈ మేరకు ధోనికి బోర్డ్ అనుమతి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా మూడు మ్యాచుల టి20 సీరీస్ లో భాగంగా భారత్ రేపు బంగ్లాదేశ్ తో రెండో టి20 లో తలపడనుంది.