వచ్చే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పటి నుంచే మాటల యుద్ధం మాత్రం మొదలయిపోయింది. నలభై వసంతాల తెలుగుదేశం పార్టీ వేడుకలు నిన్నటి వేళ హైద్రాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మరియు లోకేశ్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు తమ ప్రసంగాల్లో ఘాటు పెంచారు. తీవ్ర స్థాయిలో లోకేశ్ మాట్లాడారు. ఇదంతా కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకే అన్నది స్పష్టం. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదలబోమని, వారు అమెరికాకు వెళ్లినా, ఐవరి కోస్ట్ కు వెళ్లినా వదిలిపెట్టబోమని తెలిపారు.
ఇక లోకేశ్ ప్రసంగం ఎలా ఉన్నా నిన్నటి వేళ టీడీపీ కార్యకర్తలంతా ఒక అంతర్మథనంలో మాత్రం ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి ఏ సంక్షేమం లేకుండా కేవలం అధికార దాహం కోసమే సభ అన్న విధంగా వారంతా ఆవేదన చెందారు. ఇటీవల కాలంలో దాడులయిన కార్యకర్తలకు కాస్తో కూస్తో సాయం చేస్తున్నారని, కానీ పూర్తి స్థాయిలో ఆదుకునేంత వీలున్నా కూడా వారిని ఆదుకోవడం లేదని ఈ దశలో లోకేశ్ చెప్పే సినిమా డైలాగులు తమ కడుపు నింపవని చాలా మంది అంటున్నారు. ప్రత్యర్థులకు కాదు తమకే నిత్యం సినిమా కనపడుతోందని వారంతా బాధపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా జెండాలు మోసే భాగ్యం తమకు అప్పగించి కుర్చీలు ఎక్కే భాగ్యం వాళ్లు అందుకోవడంతో ఎన్నాళ్లు ఇక్కడున్నా ఫలితం లేదని తేల్చేస్తున్నారు.