కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక ఫేక్ వార్తలు ప్రచారమవుతున్నాయి. జనాలు వాటిని నిజమే అని నమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు సదరు పుకారు వార్తల పట్ల మోసపోతున్నారు కూడా. అయితే ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఓ ఫేక్ న్యూస్.. జనాలను నిజమైన న్యూసే అని నమ్మేలా చేసింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే…
దేశంలో కోవిడ్ 19ను నిరంతరం పర్యవేక్షించేందుకు, రాష్ట్రాలకు ఆ దిశగా మార్గదర్శకాలను జారీ చేసేందుకు, ప్రజలకు సూచనలు చేసేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసిందనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తేలింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అజయ్ భల్లా స్పష్టం చేశారు. ఆ వార్తలో ఎంత మాత్రం నిజంలేదన్నారు. కేంద్రం కోవిడ్ 19 పర్యవేక్షణకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదన్నారు.
ఇదే కాదు.. ఇంకా అనేక ఫేక్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. కనుక మీకు కూడా ఏవైనా వార్తలు వస్తే నమ్మకండి. వాటిని నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు అవి నిజమా, కాదా.. అనే విషయాలను చెక్ చేసుకోండి.