రాఫెల్ యుద్ధ విమానం కూలిందా ? నిజ‌మేనా ?

-

ఫ్రాన్స్ త‌యారు చేసిన అత్యంత అధునాత‌న‌మైన రాఫెల్ యుద్ధ విమానాల‌ను ఇటీవ‌లే భార‌త్‌కు తీసుకురాగా.. ఆ విమానాలు గురువారం ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాయి. దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఫ్రాన్స్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీలు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మొత్తం 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాయి. అయితే వాటిల్లో ఒక యుద్ధ విమానం అంబాలా ఎయిర్ బేస్ స‌మీపంలో సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా కూలిపోయింద‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో వైర‌ల్‌గా మారింది.

అయితే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న ఆ వార్త అబ‌ద్ధ‌మ‌ని తేలింది. ఈ మేర‌కు ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్‌లో వెల్ల‌డైంది. అంబాలా ఎయిర్ బేస్ స‌మీపంలో రాఫెల్ యుద్ధ విమానంలో సాంకేతిక స‌మ‌స్య రావ‌డంతో కూలిపోయింద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని, ఆ వార్త ఫేక్ అని వెల్ల‌డించారు. ఇక ఆ ప్ర‌మాదంలో పైల‌ట్ మృతి చెందాడ‌ని కూడా వార్త‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే ఆ వార్త‌ ఫేక్ అని అటు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌తోపాటు ఇటు పీఐబీ కూడా ధ్రువీక‌రించింది.

కాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారమ‌వుతున్న ఫొటో కూడా న‌కిలీద‌ని, దాన్ని ఎవ‌రో మార్ఫింగ్ చేశార‌ని పీఐబీ వెల్ల‌డించింది. ఇక ఆ ఫేక్ వార్త‌ను తాము పోస్ట్ చేయ‌లేద‌ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కూడా వివ‌ర‌ణ ఇచ్చింది. కాగా భార‌త్ మొత్తం రూ.59వేల కోట్ల వ్య‌యంతో 36 రాఫెల్ జెట్‌ల‌ను ఆర్డ‌ర్ చేయ‌గా.. వాటిలో తొలి విడ‌తా 5 విమానాలు భార‌త్‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వాటిని తూర్పు ల‌డ‌ఖ్ వ‌ద్ద లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్ వెంబ‌డి మోహ‌రించారు. చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న దుందుడుకు చ‌ర్య‌ల కార‌ణంగానే భార‌త్ ఆ విమానాల‌ను అక్క‌డ కాపలాగా ఉంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version