కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్నది వర్షాకాలం కావడంతో ఈ సీజన్‌లో అనేక మంది జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారు తమకు కరోనా సోకిందేమోనని భయపడుతున్నారు. అయితే ఇదే విషయంపై సైంటిస్టులు పరిశోధనలు చేసి సాధారణ జలుబుకు, కోవిడ్ 19 లక్షణాలకు ఉన్న తేడాను గుర్తించారు.
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాకు చెందిన పరిశోధకులు 10 మంది కోవిడ్ పేషెంట్లు, 10 మంది జలుబు ఉన్న పేషెంట్లు, 10 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ఉన్న లక్షణాలపై పరిశోధనలు చేశారు. దీంతో తేలిందేమిటంటే.. కోవిడ్ 19 వల్ల వాసన, రుచి చూసే శక్తి కోల్పోతారని, కానీ శ్వాస సరిగ్గానే ఆడుతుందని, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ ఉండడం వంటి లక్షణాలు ఉండవని తెలిపారు.
ఇక జలుబు ఉన్నవారు కూడా రుచి, వాసన చూడలేరని, కానీ వారిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ ఉంటాయని, అందువల్ల సాధారణ జలుబుకు, కోవిడ్ 19 లక్షణాలకు సులభంగా తేడాలు కనిపెట్టవచ్చని, ఈ విషయం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ స్టడీకి చెందిన వివరాలను రైనాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.