చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ క్లారిటీ

-

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నిన్నటి నుంచి మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదన్నారు రవికిరణ్‌. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామన్నారు రవికిరణ్‌.

డీఐజీ మాట్లాడుతూ.. “చంద్రబాబు రూమ్‌లో 8 ఫ్యాన్లు పెట్టాం.. నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి. 66 కేజీలు జైలుకు వచ్చినప్పుడు ఉన్నారు. ఇపుడు 67 కేజీలు ఉన్నారు. చంద్రబాబు కొంత డrహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆయనకు అవసరమైనన్ని వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేశాము. ఆయన శరీరంపై రేషస్ వచ్చాయి. జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ వైద్యులను రప్పించి పరీక్షలు చేయించాము. చంద్రబాబు జైల్లో అరోగ్యంగానే ఉన్నారు. హెల్త్ బులిటెన్ హెడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ ఇస్తారు. ఇకపై రెగ్యులర్‌గా చంద్రబాబు హెల్త్ బులిటన్ విడుదల చేస్తాము. చంద్రబాబు ఏ మందులు అయితే జైల్లోకి తీసుకువచ్చారో వాటిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 2039 మంది ఖైదీలు జైల్లో ఉన్నారు. వ్యక్తిగత వైద్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఏసీ ప్రావిజన్ లేదు. ఆయనకు ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయిలో అయితే లేదు. చంద్రబాబు మా దగ్గర రిమాండ్ ప్రిజనర్.. ఆయనకు కావాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నాం. జైల్లో వాటర్ పొల్యూషన్ జరుగుతుందని ఆరోపిస్తున్నారు అదే జరిగితే 2 వేల మంది ఖైదీలకు కూడా సమస్య రావాలి కదా. బ్యారక్‌ వరకూ ఫ్యామిలీ మెంబర్‌ను కూడా అనుమతించే పరిస్థితి లేదు.” అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version