కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండానే.. పల్లెలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వడం చిల్లర వ్యవహారమన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్రాలకే బాగా తెలుస్తుందని, ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఉంది. తాగు నీటి సౌకర్యం, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాలపై కేంద్రం దృష్టి పెట్టాలి.’’ అని అన్నారు.
దేశం గర్వించే స్థాయిలో ప్రస్తుతం తెలంగాణ ఉందన్నారు. మనం చేస్తున్న పని దేశానికే కొలమానమన్నారు. పల్లెలు, పట్టణాలను ఇప్పటికే అభివృద్ధి చెందాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రమే ముందంజలో ఉందన్నారు. మొదటి దశలో 10కి 10 గ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు ఎంపిక అయ్యాయన్నారు. కాగా, ధాన్య సేకరణ, వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కూడా మాట్లాడనున్నారు.