తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నేడు జరిగిన విషయం తెలిసిందే. దుబ్బాకలో ఓటర్లు అందరూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. కాగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరికీ చివరికి నిరాశ ఎదురయింది అని చెప్పాలి దుబ్బాక లోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం లు పనిచేయకపోవడంతో గంటల పాటు ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాలలో అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో చేసేదేమీలేక ఓటర్లు నిరాశతో వెనుతిరిగారు.
రాయపూర్ మండలం తోగుట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అంతేకాదు పలు పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బాగానే పని చేయడంలో ఎంతో మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి వాతావరణం ఉంది అని కలియతిరుగుతూ గమనించారు.