ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల వేళ కొత్త వివాదం..బీజేపీకి కొత్త ఆయుధం దొరికినట్లేనా

-

ఉద్యోగ సంఘం నేత పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కలవడం నేరమా..ఈ చిన్న విషయమే ఉద్యోగి సస్పెన్షన్ వరకు వెళ్తుందా ఇప్పుడీ అంశమే ఖమ్మం రాజకీయాల్లో కాక పుట్టిస్తుంది.అంతర్గత రాజకీయాలో.. లేక రాజకీయ నేతలతో పడలేదో కానీ..ఉద్యోగ సంఘం నేత పై చాలా కేసులు నమోదయ్యాయి. వీటికి ఆద్యం పోస్తూ ఓ పార్టీ నేతతో ఆయన భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో మరింత వేడి రగిలించింది.

ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ నేత. కొద్దిరోజుల క్రితం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్‌తో భేటీ కావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇదేదో సడెన్‌గా తీసుకున్న నిర్ణయమైతే పెద్దగా చర్చ జరిగేది కాదు. కాకపోతే కొన్నాళ్లుగా ఆయన అధికారపార్టీలోని కొందరు నేతల టార్గెట్‌లో ఉన్నారట. డిపార్ట్‌మెంట్‌పరంగా చాలా కేసులు ఎదుర్కొంటున్నారు కూడా. అందుకే సంజయ్‌ను కలవగానే సస్పెండ్‌ చేయడంతో మళ్లీ రాజకీయ వర్గాల చర్చల్లోకి వచ్చారు.

ఉద్యోగ సంఘం నేతగా పార్టీ ప్రతినిధులను కలిస్తే వేటు వేయడంపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. బీజేపీతో ఎవరు భేటీ అయినా ఇలాగే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. బీజేపీ స్వరం పెంచిన తర్వాత శ్రీనివాసరావుపై తీసుకున్న చర్యలు జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయట. త్వరలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అంశాన్ని ఉద్యోగ వర్గాలు చర్చకు పెట్టడం వేడి రగిలిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేశారు శ్రీనివాసరావు. ఆ సమయంలో మరో ఉద్యోగ సంఘం నేతతో పలు అంశాలపై పడేది కాదని సమాచారం. ఆ గ్యాప్‌ అలా పెరిగిందనేది ఉద్యోగ, టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వినిపించే మాట. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఉద్యగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించారని చెబుతారు. అప్పటి నుంచి అధికారపార్టీకి చెందిన కొందరు నాయకులకు ఓ మంత్రి గారికి టార్గెట్‌ అయిన శ్రీనివాసరావు.. చాలా చోట్లకు బదిలీ అయ్యారు. రెండేళ్లుగా కుదురుగా కూర్చుని పనిచేసింది లేదట.

ఓ సొసైటీకి చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసరావు అక్కడ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అయిదు విచారణ కమిటీ వేశారు. క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. టీఆర్‌ఎస్‌లోని కొందరు ముఖ్యనేతల మద్దతు ఉన్నప్పటికీ వేధింపుల నుంచి శ్రీనివాసరావు బయటపడలేకపోయారనే టాక్‌ ఉంది. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి విన్నవించుకున్నారట శ్రీనివాసరావు. ఈ భేటీ గురించి తెలిసిన వెంటనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చాలని బీజేపీ చూస్తోందట. మరి.. అధికార పార్టీ నాయకులు ఈ ప్రచారానికి ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version