ప్రస్తుతం వైకాపా నాయకులు కొంతమంది కాస్త అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వానికి పరోక్షంగా వ్యతిరేకంగా మాట్లాడే పనులకు పూనుకుంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి సమస్యలు అధినేతవరకూ వెళ్లినా.. పత్రికలకు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా వైసీపీ నాయకులపై ఉందనే చెప్పాలి. ఎంతో ఘనంగా 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ కు ఉండేది కూడా నెలకు ముప్పై రోజులే.. వారనికి ఏడు రోజులే.. రోజుకి 24 గంటలే! ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే… తాను నమ్మిన, తనను నమ్మిన జనాల కోసం జగన్ ముందుగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు జగన్.
కరోనా సమయంలో సాకులు చెప్పి పథకాలు పోస్ట్ పోన్ చేసే నేతలున్న ఈ రోజుల్లో… అక్టోబరులో అందాల్సిన ఆర్థిక సాయాలను నాలుగు నెలల ముందే అందిస్తున్నారు. సంక్షేమం విషయంలో ఈ స్థాయిలో ఆలోచించే జగన్.. రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గాల సమస్యలు, శ్రేణుల ఇబ్బందుల గురించి ఆలోచించరని, ఆలోచించడం లేదని ఎందుకు అనుకుంటున్నారనేది కొందరు కార్యకర్తల ప్రశ్న!
అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఇందులో మూడన్నర నెలలు హనీ మూన్ పిరియడ్ అనుకుంటే.. రెండు న్నర నెలలు కరోనా పిరియడ్ అనుకుంటే… ఇంక జగన్ కు మిగిలింది ఆరంటే ఆరు నెలలు! ఈ సమయంలోనే వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా, వాహనమిత్ర వంటి పథకాలు రెండేసి సార్లు అందించిన పరిస్థితి. ఈ సమయంలో ప్రతిపక్షాల మాదిరిగా ప్రభుత్వానికి, జగన్ కు తలనొప్పులు సృష్టించే పనులకు పూనుకోకుండా… శ్రేణులన్నీ సంయమనం పాటించాలని పలువురు సూచిస్తున్నారు.
“నా నియోజకవర్గం (వినుకొండ)లో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదు. కలెక్టర్ కు చెప్పినా ఉపయోగం ఉండడం లేదు. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ వినుకొండ రాకుండానే మాయమవుతోంది” అంటూ గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించడం… “ఇసుక దోపిడీ గురించి మా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియదు. ఆయన మల్లెపువ్వులాంటి వారు. ఇసుక దొరకలేదని సీఎంకు తెలిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ ఆయన దగ్గరికి చేరే మార్గం ఏదీ? ఆయన చుట్టూ ముళ్ల కంచె లాంటి కోటరీ ఉంది. దాని దాటుకుని వెళ్లడం అసాధ్యం”..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనడం… “ఎన్నికల నిబంధనావళి రాక ముందే 100 పడకల ఆస్పత్రి , డయాలసిస్ కేంద్రం, ఆస్పత్రులు నిర్మించాలి. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినా సమాధానం లేవు. ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఆందోళన, ఆవేదనతో మాట్లాడుతున్నా” అని వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందించడంపై వైకాపా కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు… కాస్త సంయమనం పాటించాలని… పాటిస్తారా?