తమిళనాడు లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 200 సీట్లు గెలుచుకుంటుందని డీఎంకే నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం పళని స్వామి స్పందించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 200 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని తెలిపారు. 200 సీట్లు గెలుస్తామని ఇస్తున్నటువంటి నినాదం పగటి కలనే అని.. అది ఎప్పటికీ నిజం కాదన్నారు పళని స్వామి.
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉండగా.. తమిళనాడు శాసనసభకు 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో తమ పార్టీ సారథ్యంలోని కూటమి మాత్రమే 200 సీట్లు గెలుచుకుంటుందని పళని స్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన అన్నా డీఎంకే జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 జనవరి నుంచి అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు ప్రకటించారు పళని స్వామి.