కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ చనిపోయారు. ఇవాళ ఆయన 62వ పుట్టిన రోజు. పుట్టినరోజు నాడే ఎమ్మెల్యే అన్బళగన్ మృతిచెందడంతో అటు ఆయన కుటుంబంలో, ఇటు పార్టీతో పాటు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో జూన్ 2వ తేదీన చెన్నైలోని క్రోమ్ పేట్ లో ఉన్న డాక్టర్ రీలా ఇన్స్‌టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌లో ఆయన్ని చేర్చారు. ఆయనకి పరీక్షలు జరిపిన వైద్యులు కరోనా ఉందని తేల్చేశారు. కొన్ని రోజుల నుంచి ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. అయితే మంగళవారం రాత్రి ఆయన కండీషన్ మరింత ఆందోళనకరంగా మారింది. అయితే ఎమ్మెల్యే ప్రాణాలను కాపాడలేకపోయినట్లు ఇవాళ ఉదయం డాక్టర్లు వెల్లడించారు. చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి అన్బళగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే కరోనా వైరస్ వల్ల దేశంలో ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.