దేశంలోని ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. ఇకపై వారు చేసే క్లెయిమ్‌లన్నీ దాదాపుగా ఆటోమేటిక్‌గా పూర్తి కానున్నాయి. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖర్చుల నిమిత్తం పీఎఫ్‌ను విత్‌డ్రా చేస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో నిత్యం క్లెయిమ్ దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. వాటన్నింటినీ పరిశీలించి ప్రాసెస్ చేయడం కష్టంగా మారింది. ఉద్యోగుల సంఖ్య సరిపోవడం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా క్లెయిమ్‌లు ప్రాసెస్ అయ్యే విధంగా నూతనంగా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.
కాగా కేవైసీ వివరాలు కచ్చితంగా ఉండే ఖాతాదారులు సబ్‌మిట్ చేసే క్లెయిమ్‌లను సదరు ఏఐ టూల్ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తుంది. దీంతో చాలా వరకు క్లెయిమ్‌లకు ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. అలాగే ఖాతాదారులకు పీఎఫ్ డబ్బు త్వరగా చేతికందుతుంది. దాదాపుగా 54 శాతం వరకు క్లెయిమ్‌లను ఈ విధంగానే సెటిల్ చేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలియజేసింది.
ఏఐ టూల్‌కు ముందు పీఎఫ్ సెటిల్‌మెంట్‌కు 10 రోజుల సమయం పట్టేదని, కానీ ఇప్పుడు 3 రోజుల్లోనే క్లెయిమ్స్‌ను ప్రాసెస్ చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. కాగా గతేడాది ఏప్రిల్, మే నెలల్లో 33.75 లక్షల క్లెయిమ్‌లను సెటిల్ చేశామని, ఈ సారి 36.02 లక్షల క్లెయిమ్‌లను సెటిల్ చేశామని ఆ సంస్థ పేర్కొంది. స్టాఫ్ తక్కువగా ఉన్నందు వల్లే పీఎఫ్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసేందుకు ఏఐ టూల్‌ను లాంచ్ చేసినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.