ల‌క్ష్మీవిలాస్ బ్యాంక్ డిపాజిట‌ర్లు, షేర్ హోల్డ‌ర్ల ప‌రిస్థితి ఏమిటి ? డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయా ?

-

త‌మిళ‌నాడుకు చెందిన ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార‌టోరియం విధించిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 16వ తేదీ వ‌ర‌కు మార‌టోరియం అమ‌లు కానుంది. ఈలోగా డిపాజిట‌ర్లు కేవ‌లం రూ.25వేల‌ను మాత్ర‌మే విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే బ్యాంకుపై మార‌టోరియం విధించిన నేప‌థ్యంలో డిపాజిట‌ర్లు, షేర్ హోల్డ‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయా, లేదా.. అని కంగారు ప‌డుతున్నారు.

అయితే ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌లో డ‌బ్బులు డిపాజిట్ క‌లిగి ఉన్న‌వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదని ఆర్‌బీఐ ఇప్ప‌టికే హామీ ఇచ్చింది. వారి డ‌బ్బు సుర‌క్షితంగానే ఉంటుంద‌ని తెలిపింది. కానీ షేర్ హోల్డ‌ర్లు మాత్రం పూర్తిగా న‌ష్ట‌పోతార‌ని తెలుస్తోంది. అయితే ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌కు క‌ష్టాలు త‌ప్పాలంటే ఆ బ్యాంకును ఇంకో బ్యాంకులో విలీనం చేయాల‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అందుకు సింగ‌పూర్ కు చెందిన డీబీఎస్ బ్యాంక్ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని భావిస్తున్నారు.

డీబీఎస్ బ్యాంకులో ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ క్ర‌మంలో విలీనానికి ఆమోదం ల‌భిస్తే డీబీఎస్ బ్యాంక్ ప్రారంభంలో రూ.2500 కోట్ల‌ను చొప్పిస్తూ ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌ను కొంత వ‌ర‌కు ఆదుకుంటుంద‌ని అంటున్నారు. అయితే విలీనం జ‌రిగిన‌ప్ప‌టికీ డిపాజిట‌ర్ల‌కే మేలు క‌లుగుతుంది కానీ షేర్ హోల్డ‌ర్లు పూర్తిగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

కాగా ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ కు జూన్ 2020 వ‌ర‌కు రావ‌ల్సిన‌‌ మొత్తం రుణ బ‌కాయిల విలువ‌ రూ.13,827 గా ఉంది. బ్యాంకులో డిపాజిట‌ర్లు చేసిన మొత్తం రూ.21,443 కోట్లుగా ఉంది. కానీ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోతుంద‌ని తెలిసి ఆర్‌బీఐ దానిపై మార‌టోరియం విధించింది. ఈ క్ర‌మంలో ఆ బ్యాంకు భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందా అని ప్ర‌స్తుతం డిపాజిట‌ర్లు, షేర్ హోల్డ‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version