రానున్న మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటాయట. అందువల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు రాకూడదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఏపీ ప్రజలకు ఇప్పట్లో ప్రకృతి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మొన్ననే ఫొని సైక్లోన్ వల్ల అక్కడి 733 గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి రానున్న ముప్పు తుపానుది కాదు.. ఎండ వేడిది..! ఆ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) ఏపీలో 127 ప్రాంతాలను మార్క్ చేసి పెట్టింది. వాటిల్లో 57 పైగా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటనున్నాయట.
రానున్న మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటాయట. అందువల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు రాకూడదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఆదివారాల్లో సూర్య తాపం మరీ ఎక్కువగా ఉంటుందట. ఈ నెల 8వ తేదీ వరకు ప్రజలు మధ్యాహ్నం ప్రాంతంలో బయటకు రాకూడదని, ఇండ్లలోనే ఉండాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
అయితే కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ దెబ్బ కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు కూడా. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వేడి మరీ ఎక్కువగా ఉంటుందని, కనుక జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని, ఒక వేళ అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే.. ఎండ నుంచి రక్షణగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలని, తలకు టోపీ లాంటిది ధరించాలని సూచిస్తున్నారు..!