దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దుండగులు ప్రజలను ఏమరుపాటుకు గురి చేసి, మోసం చేస్తూ కొన్ని సెకన్ల వ్యవధిలోనే వేల రూపాయలను కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో మోసగాళ్లు కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. అయితే చాలా మంది తమ బ్యాంకింగ్ లేదా కార్డుల వివరాల పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైన విషయం ఏమిటంటే.. చాలా మంది తమ డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, ఏటీఎం, యూపీఐ పిన్, ఆధార్ కార్డు, పాన్, ఈ-మెయిల్ ఐడీలు, బ్యాంకింగ్ వివరాలను ఫోన్లలో స్టోర్ చేస్తున్నారని తేలింది. దేశంలో 393 జిల్లాల్లో సుమారుగా 24వేల మందికి పైగా సర్వే చేయగా ఈ విషయం వెల్లడైంది.
సర్వేలో భాగంగా 33 శాతం మంది ఆయా వివరాలను తమ తమ ఫోన్లలో స్టోర్ చేసుకుంటామని చెప్పారు. 21 శాతం మంది ఆ వివరాలను తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకుంటామని చెప్పారు. 39 శాతం మంది కొన్ని వివరాలను తాము గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం ఆ వివరాలను తమ ఫోన్లలో స్టోర్ చేసుకుంటామని చెప్పారు. కానీ అలా చేయకూడదని నిపుణులు అంటున్నారు.
బ్యాంకులు, కార్డులకు చెందిన వివరాలు, ఆధార్, పాన్, మెయిల్ ఐడీ వివరాలను అలా ఫోన్లలో స్టోర్ చేసుకోవడం వల్ల ఫోన్లు హ్యాకింగ్ గురైనప్పుడు ఆ సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుందని, దీంతో పెద్ద ముప్పు ఏర్పడుతుందని అంటున్నారు. అందువల్ల ఫోన్లలో ఆ సమాచారాన్ని స్టోర్ చేయకూడదని సూచిస్తున్నారు.