దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈపీఎఫ్‌వో సదుపాయం ఉంటుందన్న సంగతి తెలిసిందే. వారి జీతంలో నెల నెలా కొంత మొత్తాన్ని కంపెనీలు కట్ చేస్తాయి. అలాగే కంపెనీలు ఆ మొత్తానికి సమానమైన సొమ్మును కలిపి నెల నెలా ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్లలో జమ చేస్తాయి. అయితే ఉద్యోగులు జాబ్ మానేశాక సాధారణంగా వెంటనే ఈపీఎఫ్‌ను విత్ డ్రా చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే..
ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులకు అనేక లాభాలు ఉంటాయి. సాధారణంగా డబ్బును పొదుపు చేసుకునేందుకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పథకంలో లేనంత వడ్డీని కేవలం ఈపీఎఫ్ లోనే పొందవచ్చు. అందువల్ల ఉద్యోగం మానేసినా అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయకూడదు. అలాగే నెల నెలా ఈపీఎఫ్ చెల్లించే ఉద్యోగులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీని ప్రకారం ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగి జీతం కన్నా 20 రెట్లు ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ చెల్లిస్తారు. గరిష్టంగా ఇలా రూ.6 లక్షల వరకు పొందవచ్చు.
ఇక ఈపీఎఫ్ ద్వారా పొదుపు అయ్యే సొమ్ముకు గాను ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 (సి) ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. అందువల్ల ఉద్యోగులు ఉద్యోగం మానేసినా పీఎఫ్‌ను విత్ డ్రా చేయకుండా ఉంటే ఈ లాభాలను పొందవచ్చు. ఒక వేళ మళ్లీ ఉద్యోగం లభిస్తే అవే కంటిన్యూ అవుతాయి. కనుక ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప ఈపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేయకపోవడమే మంచిది.